Site icon A2Z ADDA

Godfather Movie Review : గాడ్ ఫాదర్ రివ్యూ.. పవర్ ఫుల్ రీమేక్

Godfather Review గాడ్ ఫాదర్ చిత్రం మీద ఎంతటి నెగెటివ్ టాక్ ఏర్పడిందో అందరికీ తెలిసిందే. అయితే లూసిఫర్ కథ మీదున్న నమ్మకంతో చిరంజీవి ఈ రీమేక్ చేసేందుకు ముందుకు వచ్చాడు. సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోను కూడా తెచ్చుకున్నాడు. రీమేక్‌లను తీయడంలో దిట్ట అయిన మోహన్ రాజాను దర్శకుడిగా పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం నేడు విడులైంది. గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథ
సీఎం పీకేఆర్ మరణంతో రాష్ట్రంలో శూన్యత ఏర్పడుతుంది. పీకేఆర్ తరువాత సీఎం అయ్యేందుకు ప్రత్యర్థి పార్టీ నాయకుడు నాయుడు (షియాజీ షిండే), హోం మినిస్టర్ నారాయణ వర్మ (మురళీ శర్మ) ప్రయత్నిస్తారు. కానీ పీకేఆర్ కూతురు సత్య ప్రియ (నయనతార) భర్త జయదేవ్ (సత్యదేవ్) తాను సీఎం అవ్వాలని కోరుకుంటాడు. అందుకు తగ్గట్టు ప్లాన్లు వేస్తాడు. డ్రగ్స్ డీలర్లతో డీల్ పెట్టుకుంటాడు జయ దేవ్. రాష్ట్రం మొత్తం డ్రగ్స్ సరఫరా చేసే డీల్ పెట్టుకుంటాడు. జయదేవ్ చేసే పనులు, అసలు రూపం సత్య ప్రియకు తెలియదు. అయితే రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, పీకేఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు బ్రహ్మ (చిరంజీవి) రంగంలోకి దిగుతాడు. బ్రహ్మకు పీకేఆర్‌కు ఉన్న సంబంధం ఏంటి? సత్య ప్రియ ఎందుకు అంతగా ద్వేషిస్తుంది? అసలు బ్రహ్మ ఎవరు? అబ్రహం ఖురేషి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? మసూద్ భాయ్ ఎవరు? అనేది తెరపై చూడాల్సిందే.

లూసిఫర్ సినిమాను దాదాపు అందరూ చూసేసి ఉన్నారు. కథ, కథనాలు ఏంటో అందరికీ తెలిసిందే. అయితే రీమేక్ చేసిన తరువాత కచ్చితంగా మోహన్ లాల్ నటనకు చిరు నటనకు పోలికలు పెడతారు. అయితే తెలుగు ప్రేక్షకుల కోసం కథ కాస్త మార్చాడు మోహన్ రాజా. మంజు వారియర్‌కు కూతురిని పెడితే.. ఇక్కడ నయనతారకు చెల్లిని పెట్టాడు. ఒరిజినల్ సినిమాలో మోహన్ లాల్ ఫ్లాష్ బ్యాక్ అంత క్లియర్‌గా ఉండదు. కానీ ఇందులో మాత్రం చిరంజీవి పీకేఆర్ కొడుకే అని నిర్దారించేశారు.

అలా కొన్ని సీన్లను పూర్తిగా మార్చేశారు. మోహన్ లాల్ లూసిఫర్ అంతా సీరియస్‌గా సాగుతుంటుంది. కానీ గాడ్ ఫాదర్ మాత్రం అలా కాదు. కాస్త లైటర్ వేలో సాగినట్టుగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో కామెడీ సీన్లు ఇరికించడం, అనవసరంగా పాటలు పెట్టడంతో ఉండాల్సిన ఘాడత తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ మోహన్ రాజా మాత్రం కథలోని సోల్ మిస్ అవ్వకుండా చూసుకున్నాడు. ప్రథమార్థం అంతా కూడా చకచకా సాగుతుంది.

ఎక్కడా కూడా డీవియేట్ అయినట్టు అనిపించదు. ప్రథమార్థంలోని కొన్ని సీన్లు హైలో ఉంటాయి. రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. చిరు ఎంట్రీ సీన్, ఇంటర్వెల్ సీన్, సత్య దేవ్ చిరు సంభాషించే సీన్లు అదిరిపోతాయి. సెకండాఫ్‌లోనూ ఇలాంటి సీన్లున్నాయి. అయితే కథ ప్రీ క్లైమాక్స్‌కు వచ్చాక.. చూడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. సల్మాన్ ఖాన్ ఎంట్రీతో సీన్ అంతా కూడా మారిపోతుంది. తుపాకీ మోతతో విసుగించినట్టు అనిపిస్తుంది.

అయితే గాడ్ ఫాదర్‌గా చిరు చెప్పిన కొన్ని పొలిటికల్ డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి. మీకు పదవి అక్కర్లేదేమో గానీ.. ఆ పదవి మిమ్మల్ని కోరుకుంటుంది అంటూ ఇలా చెప్పించిన పొలిటికల్ డైలాగ్స్ బాగానే ఉన్నాయి. మాటలు అందరిలోనూ ఓ మార్క్ వేస్తాయి. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అదిరింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెంటల్ ఎక్కించేసింది. ఎడిటింగ్ బాగానే ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. గాడ్ ఫాదర్ అయితే లూసిఫర్‌కు పవర్ ఫుల్ రీమేక్‌గా అనిపిస్తుంది.

గాడ్ ఫాదర్ సినిమాలో ఎవరికి వారే అన్నట్టుగా నటించారు. ప్రతీ పాత్ర హైలెట్ అయింది. బ్రహ్మ కారెక్టర్లో గాడ్ ఫాదర్‌గా చిరంజీవి మెప్పించేశాడు. చిరు కొన్ని సీన్లలో కంటి చూపుతోనే నటించేశాడు. కళ్లతోనే నటించేశాడు.. అని దర్శకుడు చెప్పిన ఆ సీన్లలో చిరంజీవి మ్యాజిక్ చేసేశాడు. ఇక చిరంజీవి ముందు ఏ మాత్రం తొణక్కుండా జయ దేవ్ పాత్రను పోషించేశాడు సత్య దేవ్. కొన్ని సీన్లలో అయితే చిరుని కూడా డామినేట్ చేసేశాడు. నయనతార తన పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. బ్రహ్మాజీ, సునీల్, మురళీ శర్మ, షియాజీ షిండే, షఫీ, పూరి జగన్నాథ్ ఇలా అందరూ తమ పాత్ర మేరకు మెప్పించేశారు.

గాడ్ ఫాదర్.. రాడ్ ఫాదర్ కాకుండా తప్పించుకుంది

రేటింగ్ 2.75

Exit mobile version