Site icon A2Z ADDA

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ రివ్యూ.. క్రింజ్ కామెడీ.. తట్టుకోలేం బాబోయ్

Extra Ordinary Man Movie Review నితిన్‌కు ప్రస్తుతం టైం బాగా లేదు. భీష్మ తరువాత హిట్టు కొట్టలేకపోతోన్నాడు. మాస్ట్రో మంచి ప్రయత్నమే. కానీ అది ఓటీటీలో వచ్చింది. రంగ్ దే దెబ్బేసింది. మాచర్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇలాంటి బ్యాడ్ టైంలో నితిన్ సినిమా, అది కూడా ఫాంలో లేని వక్కంతం వంశీతో అంటే సాహసమే. ఆ సాహసం పేరే ఎక్స్‌ట్రా ఆర్డనరీ మ్యాన్. మరి ఈ చిత్రం అటు వంశీకి, ఇటు నితిన్‌కు ఆక్సిజన్ లాంటిది. ఈ సినిమా ఆడియెన్స్‌కు ఆక్సిజన్‌లా మారిందా? కార్బన్ డై యాక్సైడ్‌‌లా మారిందో ఓ సారి చూద్దాం.

కథ
ఈ కథ సెల్వమణి (సంపత్) మీద ఓపెన్ అవుతుంది. తన ఇరవై కోట్ల సరుకు పోలీసులకు చిక్కే ప్రమాదంలో పడుతుంది. అప్పుడే ఎర్ర బాలు (నితిన్) అనే కారెక్టర్ ఎంట్రీ ఉంటుంది. పోలీసుల నుంచి ఈ సరుకుని తీసుకురావడంతో సెల్వమణి ముచ్చటపడిపోతాడు. ఎర్ర బాలు ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఎర్ర బాలు తన గతం చెబుతాడు. ఆ గతంలో ఎర్ర బాలు కాస్త.. జూ. ఆర్టిస్ట్ అభిగా, ఎస్సై సాయి నాథ్‌గా కనిపిస్తాడు. ఇలా ఎర్ర బాలు, అభి, ఎస్సై సాయి నాథ్ పాత్రలు  చేసిన పనులేంటి? ఇతగాడి కథలో తండ్రి సోమ శేఖరం (రావు రమేష్), ప్రేయసి లిఖిత (శ్రీలీల)ల పాత్ర ఏంటి? విలన్‌గా నీరో (సుదేవ్) కారెక్టర్ ఏంటి? ఐజీ విజయ్ (రాజశేఖర్) ప్రాధాన్యం ఏంటి? సెల్వమణి చివరకు ఏం అవుతాడు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

నటీనటులు
నితిన్ నటుడిగా ఎప్పుడూ అంత గొప్పగా ప్రయోగాలు చేయలేదు. కమర్షియల్ హీరో ఏం చేయగలడో అవన్నీ చేస్తాడు. పాటలు, ఫైట్లు, డైలాగ్స్, హీరోయిన్లతో రొమాన్స్, కామెడీ ఇలా తెరపై అదరగొట్టేస్తాడు. ఇందులోనూ అంతే. మూడు గెటప్స్‌లో మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడు. తన వరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు. శ్రీలీల కనిపిస్తే ఓ మాట.. లేదంటే ఓ పాట. అంతకు మించి ఆమె చేసేదేమీ ఉండదు. రావు రమేష్ ఈ సారి రఫ్పాడించేశాడు. తన మ్యానరిజంతో నవ్వించేశాడు. రాజశేఖర్ కూడా ఓకే అనిపిస్తాడు. కానీ ఆయన రేంజ్ కారెక్టర్ కాదనిపిస్తుంది. సుదేవ్ విలన్‌గా,కమెడియన్‌గా ఆకట్టుకుంటాడు. చమ్మక్ చంద్ర, ఆది, బ్రహ్మాజీ, జబర్దస్త్ సత్య, సోనియా ఇలా బ్యాచ్ బ్యాచ్ కట్టకట్టుకుని రెండో భాగంలో నవ్వించే ప్రయత్నం చేస్తారు.

విశ్లేషణ
వక్కంతం వంశీ ఈ కథను రాసుకున్నాడని చెప్పాల్సిన పని లేదు. రేసుగుర్రం, కిక్ 2 వంటి సినిమాలను మళ్లీ మిక్సీలో వేసి తీశాడు. అందులో కొంచెం ఇందులో కొంచెం అన్నట్టుగా.. అన్నీ కలిపి ఈ కథను వండుకున్నాడు. ఇక ఈ కథలో లోపాల గురించి చెప్పుకుంటూ పోతే రోజులు చాలవన్నట్టుగా ఉంటుంది. ప్రతీ సీన్ ఓ క్రింజ్ కామెడీలా అనిపిస్తుంది. ఇలా ఉందేంట్రా బాబు అన్నంతగా అసహ్యం వేసినా వేస్తుంది చూసే ప్రేక్షకుడికి.

ముందు హీరోయిన్ పాత్రను రాసుకున్న తీరు గురించి మాట్లాడుకుందాం. హీరోయిన్ ఇందులో ఓ కంపెనీకి చైర్మన్. వాళ్లది చాలా పెద్ద కుటుంబం. బాగా డబ్బున్న కుటుంబం. కానీ తెరపై ఆమెను వేసే వేషాలు, చేసే చేష్టలు చూస్తే అలా అనిపించదు. ఓ కంపెనీ చైర్మన్ ఏంటి ఇలా ఉంది? అన్నట్టుగా కనిపిస్తుంది. ఆ ఇంట్లో వాళ్లను చూపించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శ్రీలీల ఇలాంటి పాత్రలు చేస్తే ఇంకో ఏడాది మాత్రమే కనిపిస్తుంది. ఆ తరువాత ఆమెకు అవకాశాలు రావనిపిస్తోంది.

తండ్రీ కొడుకుల ట్రాక్ ఓ వరకు బాగానే అనిపిస్తుంది. కానీ అది కూడా కొన్ని సార్లు అతి అనిపిస్తుంది. సినిమా పేరులోనే ఎక్స్ ట్రా ఉంది కాబట్టి.. అది సీన్లలోనూ కనిపిస్తుంది. అతి అన్నది ఈ చిత్రం ఆసాంతం కనిపిస్తూ ఉంటుంది. ప్రథమార్దం ఏదోలా భరించేయొచ్చు. కానీ రెండో భాగం మరీ క్రింజ్ కామెడీకి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటుంది. వాళ్లు పోలీసులా? అది పోలీస్ స్టేషనా? అన్న అనుమానం కలిగితే అది ప్రేక్షకుడి తప్పు కాదు.

పోలీస్ స్టేషన్‌‌లో వాళ్లు వేసిన కుప్పి గెంతులు, పాడిన పాట చూస్తే పోలీసులు అంటే జాలి కలుగుతుంది. చీ చీ అనిపించేలా ఆ ట్రాక్ ఉంటుంది. అది వస్తుంటే కుర్చీలో కూర్చున్న ప్రేక్షకులు నవ్వడం కాదు కదా.. ఇదేం గోలరా బాబు అనుకుంటాడు. ఈ సీన్‌కు ప్రేక్షకుడు నవ్వుతాడు అని వంశీ రాసుకున్న చాలా చోట్ల ఎదురు దెబ్బ తగులుతుంది. అది కామెడీ అని వంశీ పొరబడినట్టుగా ఉన్నాడు. ఏ ఒక్క ఎమోషనల్ సీన్‌కు ప్రేక్షకుడు కనెక్ట్ కాడు. సెకండాఫ్‌లో ఊరి జనం పడేది బాధనా? వారు నిజంగానే కష్టాల్లో ఉన్నారా? అసలు హీరో ఎందుకు వెళ్లాడు? ఏం చేద్దామనుకుంటున్నాడు? అన్నది చూసే జనాలకు అర్థమే కాదు.

అదేదో బాహుబలి, కేజీయఫ్ రేంజ్‌లో హీరో చేతిని చూపిస్తారు. బావిలోంచి హీరో చేతిని లేపే సీన్, అసలు ఆ ట్రాక్, ఆ కాన్సెప్ట్ చూస్తే వంశీ ఇంకెక్కడ ఉన్నాడో అర్థం అవుతుంటుంది. ఈ కథలోనే లోపం ఉంది. కాదు కాదు.. ఈ కథే పెద్ద లోపం. జూ ఆర్టిస్ట్ ఏంటి.. స్క్రిప్ట్ వినడం ఏంటి.. హీరోగా తీసేస్తో.. రియల్‌గా హీరో అవుదామని అనుకుంటూ ఆ స్క్రిప్ట్ ఫాలో అవ్వడం ఏంటో.. దర్శకుడికి, ఒప్పుకున్న హీరోకే తెలియాలి.

ఇలా ఈ సినిమాలోని సీన్లు, షాట్లను విమర్శిస్తూ పోతూ చాలానే ఉంటాయి. హీరోయిన్ ఇంట్లో హీరో వేసే వేషాలు, సోషల్ మీడియాలోని ట్రెండ్‌ను పట్టుకోవడం, నరేష్ ప్రేమాయణం, విజయ్ రష్మిక లవ్ రూమర్లు, బాలయ్య ఫ్యాన్స్‌ను కొడతాడట కదా అనే సీన్.. అమ్మానాన్నలే అత్తమామలు అని హీరో పిలిచే సీన్ కాస్త నిజంగానే నవ్వు పుట్టించేలా ఉంటాయి. మిగతాది అంతా తట్టుకోలేం బాబోయ్ అనాల్సిందే.

టెక్నికల్‌గానూ ఈ సినిమా ఏ మాత్రం మెప్పించదు. డేంజర్ పిల్ల పాట తప్పా హారీస్ జయరాజ్ ఇచ్చిన ట్యూన్స్, ఆర్ఆర్ ఎవ్వరికీ ఎక్కదు. కెమెరా వర్క్ మాత్రం రిచ్‌గా అనిపిస్తుంది. సీన్లను తీసేయాల్సి వస్తే ఎడిటర్ సినిమాను లేపేయాల్సి ఉంటుంది. నిర్మాతలు మాత్రం బాగానే ఖర్చు పెట్టినట్టుగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా కలెక్షన్లు వస్తాయా? లేదా? అన్నది చెప్పలేం.

రేటింగ్ 2

ఎక్స్‌ట్రా ఆర్డినరీ కాదు.. అవుట్ డేటెడ్ ఆర్డినరీ కథ

Exit mobile version