హీరోగా నటిస్తూ.. దర్శకత్వం చేయడం.. కథను రాసుకోవడం.. చాలా కష్టమైన పని. ఇలా ఇప్పుడు యంగ్ హీరోలంతా కూడా మల్టీ టాస్కులే చేస్తున్నారు. తమ కథలు తామే రాసుకుని, నటిస్తూ, తెరకెక్కిస్తున్నారు. అలా ధృవ వాయు ఇప్పుడు కళింగ అంటూ వచ్చాడు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే ఈ క్రమంలో వేసిన ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కథాకమామీషు ఏంటో ఓ సారి చూద్దాం.
కథ
కళింగ అనే సంస్థానానికి ఓ శాపం ఉంటుంది. 1922లో ఆ సంస్థానంలోని ప్రజలంతా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ప్రజల సంరక్షణ కోసం రాజు ఆత్మ త్యాగానికి సిద్దపడతాడు. ఆ తరువాత ఆ శాపం తొలిగిపోతుంది. అప్పటి నుంచి ఆ సంస్థానం పొలిమేర దాటకూడదనే నియమం పెట్టుకుంటారు. అలా ప్రస్తుతానికి కథ వచ్చేస్తుంది. కళింగ ఊర్లో అనాథగా లింగ (ధృవ వాయు) సారా కాస్తూ జాలీగా ఉంటాడు. ఆ ఊరి పెద్ద (ఆడుకాలమ్ నరైన్), అతని తమ్ముడు బలి (బలగం సంజయ్) తమ గుప్పిట్లో పెట్టుకుంటారు. ఇక బలి అయితే ఆడవారి మీద ప్రతాపం చూపిస్తుంటాడు. ఇక లింగ చిన్నప్పటి నుంచి పద్దు (ప్రగ్యా నయన్)ని ఇష్టపడుతుంటాడు. వీరిద్దరూ ప్రేమలో ఉంటారు. కానీ పెళ్లికి ఓ చిక్కు పడుతుంది. ఆ చిక్కు ఏంటి? చివరకు లింగ ఊరి పొలమేర దాటి శాపగ్రస్థమైన స్థలంలోకి ఎందుకు వెళ్తాడు?. ఆ తరువాత ఏం జరుగుతుంది?. అక్కడ ఉండే అసురభక్షి కథ ఏంటి? అసుర భక్షిని లింగ ఎలా అంతం చేస్తాడు? అన్నది కథ.
నటీనటులు
ధృవ వాయు లింగ పాత్రకు న్యాయం చేశాడు. లింగ కారెక్టర్‌కు రగ్డ్ నెస్‌ను చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్ బాగానే చేశాడు. ఇక హీరోయిన్ ప్రగ్యా పద్దు పాత్రలో అందంగా కనిపించింది. విలన్లుగా కనిపించిన ఆడుకాలం నరైన్, బలగం సంజయ్ బాగా నటించారు. లక్ష్మణ్ మీసాలా ఫ్రెండ్ కారెక్టర్‌లో మెప్పిస్తాడు. బలగం ఆర్టిస్టులు ఇందులో బాగానే మెప్పించారు. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు పర్వాలేదనిపిస్తారు.
విశ్లేషణ
కళింగ సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగానే ఉంటుంది. ధృవ వాయు మేకింగ్ అందరినీ మెప్పిస్తుంది. తెరపై చాలా రిచ్‌గా, అద్భుతంగా అనిపిస్తుంది. టెక్నికల్ టీంను వాడుకుని మంచి అవుట్ పుట్‌ను రాబట్టుకొన్నాడు. ఆ విషయంలో ధృవ వంద శాతం సక్సెస్ అయ్యాడు. ఇలాంటి చిత్రాలకు టెక్నికల్ టీం ప్రధాన బలంగా నిలుస్తుంది. ఆర్ఆర్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఫారెస్ట్ విజువల్స్, భయపెట్టే సీన్లను కెమెరామెన్ ఎంతో సహజంగా, అందంగా తీశాడు. కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ వర్క్ వల్లే ఈ సినిమా నిలబడుతుందని చెప్పొచ్చు.
సినిమా ఫస్ట్ పది నిమిషాలు అద్భుతంగా అనిపిస్తుంది. కథలోకి ఆడియెన్స్‌ను అలా లీనం చేసేస్తాడు. తరువాత ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ ఉంటుంది. అసలేం జరుగుతోంది? పొలిమేర దాటిన వ్యక్తులేం అవుతున్నారు? ఎవరు చంపుతున్నారు.. ఎవరు అలా భక్షిస్తున్నారు? అనే పాయింట్లతో ముందుకు సాగుతుంది. చాలా చోట్ల భయపెట్టిస్తాడు. కొన్ని చోట్ల వెన్నులో వణుకు పుట్టిస్తాడు దర్శకుడు. ఇంటర్వెల్‌కు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుంది.
అయితే సెకండాఫ్‌కు ప్రధాన బలం.. చివరి 20 నిమిషాలు. వీఎఫ్ఎక్స్‌తో ఆకట్టుకుంటారు. వాటిని చూస్తే ఈ మధ్య వచ్చి కాంతార, విరూపాక్ష, హనుమాన్ చిత్రాలు కూడా గుర్తుకు వస్తాయి. ఆడియెన్స్ ఈ మూవీని చూసిన తరువాత ఇది చిన్న సినిమా అంటే నమ్మరు. అంత రిచ్‌గా, గ్రాండియర్‌గా కనిపిస్తుంది. కళింగకు నిర్మాతలు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది.
రేటింగ్ 3.25