Site icon A2Z ADDA

ఫ్లాపులే వస్తుండొచ్చు.. డిజాస్టర్లే పడొచ్చు.. కానీ చిరంజీవి ఎప్పటికీ చిరంజీవే

శివ శంకర వర ప్రసాద్ అనే సాధారణ వ్యక్తి.. ఓ తెలియని, పరిచయం లేని రంగంలోకి వచ్చాడు. జీరో నుంచి అనే బదులు మైనస్ నుంచి మొదలు పెట్టాడు. చిన్న చిన్న పాత్రలు.. దొరికిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టలేదు.. పక్క విషయాలు పట్టించుకోకుండా.. తన పని తాను నిష్టగా, అంకితభావంతో చేసుకుంటూ పోయే గుణం కలిగిన వాడు.. అజాత శత్రువులా ఉండేవాడు.. క్రమక్రమంగా సినిమా అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు.

ఈ క్రమంలో ఖైదీ అంటూ అభిమానుల గుండెల్లో బంధీ అయ్యాడు.. అప్పటి వరకు తెలుగు చిత్ర సీమలో ఉన్న పోకడల్ని దారి మళ్లించాడు. పాటలు, ఫైట్లు, డ్యాన్సులకు ప్రత్యేక స్థానాన్ని కల్పించాడు. తన స్టెప్పులతో 80, 90వ దశకాల్ని రఫ్ఫాడించాడు. గత 25 ఏళ్లుగా ఎంతో మంది హీరోలు డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు. కానీ చిరంజీవికి ఉన్న స్జానాన్ని మాత్రం భర్తీ చేయలేకపోతోన్నారు.

గత నాలుగు దశాబ్దాలుగా చిరంజీవి ఈ చిత్రసీమపై వేసిన ముద్రను ఎవ్వరూ చెరపలేకపోతోన్నారు. ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు, సూపర్ హిట్లు చిరంజీవికి కొత్త కాదు. ఈ తరం వారు చిరంజీవిని గాడ్ ఫాదర్, భోళా శంకర్, ఆచార్య అంటూ ఇలా ట్రోలింగ్ చేయొచ్చు గాక.. చిరంజీవిని ట్రోలింగ్ చేయడానికి వారికి ఆ సినిమాలు అవకాశం ఇచ్చి ఉండొచ్చు గాక.. కానీ ఫ్లాపులు, డిజాస్టర్లు చిరంజీవిని ఇంచు కూడా కదిలించలేవని వారికి తెలియడం లేదు.

హిట్లు, ఫ్లాపులకు అతీతమైన వాడే చిరంజీవి.. చిరంజీవి ఎప్పటికీ చిరంజీవే.. ఒక్క సూర్య కిరణం పడితే.. చీకటి చీలుతుందన్నట్టుగా.. ఒక్క హిట్టు సినిమా పడితే విమర్శలన్నీ ప్రశంసలుగా మారుతుంటాయి.. అసలు సినిమా ఫలితాలతో చిరంజీవి ఇమేజ్‌ను కొలిచే స్థాయి కాదు ఆయనది. బ్లడ్ బ్యాంక్ పెట్టినా, ఐ బ్యాంక్ పెట్టినా కూడా ఆయన వెన్నంటే అభిమానులు నడిచారు.. నడుస్తున్నారు.. ఇంకా నడుస్తూనే ఉంటారు..

70వ ఏట అడుగు పెట్టినా కూడా చిరంజీవి ఇంకా అదే ఉత్సాహంతో పని చేస్తున్నారు. అభిమానుల్ని సంతోష పెట్టాలని, అలరించాలని ఇంకా రెట్టింపు శక్తిని తెచ్చుకుని మరీ పని చేస్తున్నారు. విశ్వంభర పనులు పూర్తి చేసిన చిరు.. అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌ మీద ఫోకస్ పెట్టారు.. ఇక ఇప్పుడు బాబీతో రెండో సారి చిరు మూవీని చేయబోతోన్నారు. వీటికి సంబంధించిన అప్డేట్లు నేడు రాబోతోన్నాయి. చిరంజీవి ఎప్పటికీ చిరంజీవిలా ఉండాలని కోరుకుందాం.

Exit mobile version