Site icon A2Z ADDA

ఛావా తెలుగు రివ్యూ.. సింహ గర్జన ఎలా ఉందంటే?

విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఛావా చిత్రం తెలుగులోకి వచ్చింది. మార్చి 7న ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. ఇప్పటికే హిందీలో ఈ మూవీ 500 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. మూడు వారాల తరువాత ఈ మూవీని డబ్బింగ్ రూపంలో నేడు తెలుగులోకి తీసుకు వచ్చారు. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

ఔరంగజేబు దక్షిణాదిపై దండయాత్ర చేయాలని చూస్తుంటాడు. కానీ ఛత్రపతి శివాజీ ఉండగా అది సాధ్యం కాదని తెలుసు. శివాజీ మరణంతో ఔరంగజేబు సంబరపడతాడు. అక్కడి నుంచే ఈ ఛావా మొదలవుతుంది. శివాజీ చనిపోయాడు.. ఇక ఎదురు చెప్పే వారెవ్వరూ లేరని అనుకుంటున్న టైంలో శివాజీ తనయుడు శంభాజీ (విక్కీ కౌశల్) కదన రంగంలోకి దూకుతాడు. ఇక శంభాజీని హత మార్చేందుకు ఔరంగజేబు స్వయంగా బయల్దేరుతాడు. ఈ పోరులో చివరకు ఏం జరుగుతుంది? ఛావాకి ఎదురైైన పరిస్థితులు ఏంటి? ఛావా భార్య ఏసు (రష్మిక) పాత్ర ఏంటి? అన్నది కథ.

శంభాజీ మహారాజ్ గురించి చరిత్ర పుటల్లో ఎక్కువగా లేదు. ఉన్న కొన్ని పుస్తకాలు రకరకాలుగా వర్ణించాయి. శంభాజీని శివాజీ జైల్లో పెట్టాడని, శంభాజీ రాజుగా యోగ్యుడు కాదంటూ ఇలా ఏవేవో కథనాలున్నాయి. అయితే లక్ష్మణ్ ఉటేకర్ మాత్రం మరాఠా సామ్రాజ్యాన్ని నిలబెట్టిన శంభాజీ కథను ఛావా రూపంలో చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమాలో చూపించింది అంతా నిజమా? అంటే చెప్పలేం. సినిమాటిక్ లిబర్టీస్ అనేవి చాలా ఉంటాయి. ఇందులో ఎంత కల్పన ఉంది? ఎంత నిజం ఉందన్నది చరిత్ర కారులు కూడా సరిగ్గా చెప్పలేరేమో.

ఇక ఈ మూవీ ప్రథమార్దం ఓకే అనిపిస్తుంది. సెకండాఫ్ గూస్ బంప్స్‌లా ఉంటుంది. చివరి 20 నిమిషాలు మాత్రం కన్నీరు పెట్టాల్సింది. గుండెల్ని మెలిపెట్టేలా ఆ సీన్లు ఉంటాయి.  మనసు చలించిపోయేలా ఆ సీన్లు ఉంటాయి. హైందవ ధర్మ స్థాపన, స్వరాజ్యం కోసం శంభాజీ ప్రాణ త్యాగం, వీరోచితంగా పోరాడిన తీరుకు దండం పెట్టాల్సిందే. టెక్నికల్‌గానూ సినిమా ఎంతో గ్రాండియర్‌గా అనిపిస్తుంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది. విజువల్స్, కెమెరా, వీఎఫ్ఎక్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా అన్నీ బాగుంటాయి.

విక్కీ కౌశల్‌కు ఛావా చిత్రంతో కచ్చితంగా జాతీయ అవార్డు రావాల్సిందే. చివరి 20 నిమిషాలు విక్కీ కౌశల్ తన శౌర్యాన్ని, వీరత్వాన్ని ప్రదర్శించి ఆడియెన్స్‌ను మెప్పిస్తాడు. రష్మిక ఎంతో హుందాగా నటించింది. కనిపించింది. అక్షయ్ ఖన్నా మాత్రం ఔరంగేజబుగా జీవించేశాడు. అశుతోష్ రానా, ప్రదీప్ రావత్ సింగ్ ఇలా అన్ని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి.

ఛావా.. నిజంగానే ఓ సింహ గర్జన

రేటింగ్ 4

Exit mobile version