అల్లు అర్జున్ పుష్ప సినిమాకు కన్నడలో పెద్ద దెబ్బ పడేట్టు కనిపిస్తోంది. మొత్తానికి బన్నీ జాతీయ స్థాయిలో పుష్ప సినిమాతో తన సత్తాను చాటేందుకు తహతహలాడుతున్నాడు. కానీ పుష్ప విషయంలో ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూనే ఉంది. చివరి వరకు సినిమా విడుదలవుతుందా? లేదా? అనే అనుమానాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.
తెలుగులో రిలీజ్ చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేవట. కానీ హిందీలో మాత్రం సమస్యలు ఏర్పడ్డాయట. అవి కూడా నేడు సమసిపోయేట్టున్నాయి. మొత్తానికి పుష్పకు ఇప్పుడు కన్నడలో దెబ్బపడింది. అసలే కన్నడిగులు.. కన్నడ భాష మీద విపరీతమైన మక్కువ ఉంటుంది. డబ్బింగ్ సినిమాలను ప్రదర్శించొద్దని ఇన్నాళ్లు మడి కట్టుకుని కూర్చున్నారు.
కానీ ఇప్పుడు రూల్స్ మార్చేసుకున్నారు. డబ్బింగ్ చిత్రాలను ప్రదర్శించేందుకు ఒప్పుకున్నారు. అయితే కన్నడ పుష్ప విషయంలో మాత్రం కన్నడిగులు హర్ట్ అయ్యారు. కన్నడ వర్షన్‌లో సినిమాను రిలీజ్ చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని, కానీ డబ్బింగ్ పేరిట కన్నడ రాష్ట్రంలో తెలుగు వర్షన్‌ను రిలీజ్ చేస్తే ఊరుకునేది లేదని కన్నడ అభిమానులు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.
BoycottPushpaInKarnataka అనే హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్లు దుమ్ములేపుతున్నారు. మొత్తానికి బెంగళూరు, మంగళూరు వంటి ఏరియాల్లో తెలుగు వర్షన్ షోలు ఎక్కువగా వేయడంతోనే ఈ సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. మరి వీటిని చిత్రయూనిట్ పరిగణలోకి తీసుకుని పరిష్కరిస్తుందో లేదో చూడాలి.