Site icon A2Z ADDA

మోతెవరి లవ్ స్టోరీ రివ్యూ.. పేరులో ఉన్న వైబ్ కథలో లేకపాయే

Mothevari Love Story Review మై విలేజ్ షో టీం ఇన్నేళ్లు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ నవ్వించారు. అయితే ఈ సారి అనిల్ గీలాను హీరోగా పెట్టిన మధుర శ్రీధర్, జీ5 టీం, మై విలేజ్ షో టీం కలిసి ‘మోతెవరి లవ్ స్టోరీ’ని తీశారు. ఈ సిరీస్‌లో మై విలేజ్ షో టీం అంతా నటించింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? నిజంగానే మోతెవరి టైటిల్‌కు తగ్గట్టుగా ఉందా? లేదా? అన్నది చూద్దాం.

కథ
ఆరెపల్లి అనే గ్రామంలో పర్శి (అనిల్ గీలా) గాలికి తిరుగుతుంటాడు. అనిత (వర్ష)కు ఇన్ స్టా అన్నా, రీల్స్ అన్నా పిచ్చి. అనితను ఇన్ స్టాలో ఫేమస్ చేసేందుకు పర్శి నానా తంటాలు పడతాడు. అనిత తండ్రి సత్తయ్య (మురళీధర్ గౌడ్), బాబాయ్ నర్సింగ్ (సదన్న) ఎప్పుడూ ఆస్తి కోసం పాకులాడుతుంటారు. పైకి ప్రేమగా కనిపించినా కూడా అన్నదమ్ముల్లిద్దరూ ఆస్తి కోసం ఆరాటపడుతుంటారు. పర్శిని అతని బామ్మ అనుమవ్వ చిన్నతనం నుంచి పెంచుతుంది. అయితే అనుమవ్వ పేరు మీద సత్తయ్య తండ్రి పరుశురాములు ఓ ఐదు గుంటల భూమిని రాసి పెడతాడు. ఈ విషయం తెలిసిన సత్తయ్య, నర్సింగ్ ఏం చేస్తారు? ఆ ఐదు గుంటలు భూమిని అసలు ఆమె పేరు మీద ఎందుకు రాశాడు? చివరకు ఆ ఐదు గుంటల భూమి ఏం అవుతుంది? అన్నది కథ.

పేరు మోతెవరి లవ్ స్టోరీ అని పెట్టారు.. టీజర్, ట్రైలర్ చూసి ఆ మోతెవరి అనిల్ గీలా అని అనుకుని ఉంటారు. అసలు అనిల్, వర్ష లవ్ ట్రాక్ ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా నచ్చదు. పైగా వర్ష పాత్రను తీర్చి దిద్దిన తీరు చూస్తే జనాలకు చిరాగ్గా అనిపించొచ్చు. నిబ్బా, నిబ్బిలా ప్రేమ కథను చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి మోతెవరి లవ్ స్టోరీ అనే పేరు ఎందుకు పెట్టార్రా బాబు అని చూసే ప్రేక్షకులు అనుకుని ఉంటారు. కానీ ఓ ఎపిసోడ్‌తో మాత్రం అందరినీ కట్టి పడేస్తారు.

మోతెవరి అనేది అనిల్ కాదు.. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే రాజు అని తెలుస్తుంది. అనుమవ్వ, రాజు లవ్ స్టోరీని ఓ ఎపిసోడ్‌లో చూపిస్తారు. ఆ ట్రాక్ మాత్రమే అంతో ఇంతో ఎమోషనల్‌గా టచ్ అవుతుంది. ఇందులో అనిల్ పాత్ర కూడా ఏమంత ఇంట్రెస్టింగ్‌గా, హీరోయిక్‌గా ఉండదు. ఏదో ఉన్నాడంటే ఉన్నాడన్నట్టుగానే కనిపిస్తుంది. ఇక హీరోయిన్ వర్ష పాత్ర అయితే చాలా మందికి నచ్చకపోవచ్చు. ఓ క్లారిటీ అంటూ లేకపోవడం, నిబ్బిలా ప్రవర్తించడం తప్పా.. కొత్తగా ఏమీ ఉండదు.

ప్రేమ, భూమి కోసం కొట్లాట అనే కాన్సెప్టుతో మంచి డ్రామాను పండించొచ్చు. కానీ ఇక్కడ అలాంటి డ్రామా, ఇంటెన్స్ ఎమోషన్స్ ఏమీ కనిపించవు. అప్పుడప్పుడు అక్కడక్కడా కొన్ని చోట్ల నవ్వులు మాత్రం పూయిస్తారు. సత్తయ్య, నర్సింగ్ పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. అయితే ఏ ఎపిసోడ్‌లోనూ కూడా నెక్ట్స్ ఏం జరుగుతుందో అనే ఇంట్రెస్ట్‌ను మాత్రం క్రియేట్ చేయలేకపోయారు. అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. పోనీ చివర్లో ఏదైనా అదిరిపోయే ట్విస్ట్ ఇస్తారేమో అనుకుంటే.. ఓ లెటర్‌తో సరిపెట్టారు. ఆ లెటర్ కూడా అప్పుడే ఫ్రెష్‌గా ఏదో రాసి పెట్టినట్టుగా అనిపిస్తుంది.

ఇక ఈ సిరీస్‌లో లాజిక్స్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టుగా ఉంటుంది. న్యూ ఏజ్ లవ్ ట్రాక్ మరీ సిల్లీగాా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతో ఇంతో కాపాడుతుంది. నటీనటుల విషయానికి వస్తే మాన్సీ, రాజు బాగానే మెప్పిస్తారు. సత్తయ్య, నర్సింగ్ పాత్రలు ఆకట్టుకుంటాయి. పర్శి పాత్రలో అనిల్ తనకు అలవాటైన నటనను కనబర్చుతాడు. వర్ష కారెక్టర్ ఉండటమే అలా ఉంది కాబట్టి.. చాలా మందికి ఎక్కకపోవచ్చు. గంగవ్వ ఓ పాత్రలో అలా మెరిసి ఇలా వెళ్లిపోతుంది. మిగిలిన పాత్రల్లో అందరూ తమ తమ పరిధి మేరకు ఆకట్టుకుంటారు.

మోతెవరి లవ్ స్టోరీకి ప్రధాన బలం సంగీతం. మ్యూజిక్ గానీ, ఆర్ఆర్ గానీ అదిరిపోయాయి. ఇక కెమెరా విజువల్స్ ఎంతో సహజంగా ఉన్నాయి. అయితే ఈ సిరీస్‌ అంతా కూడా ఒక ఊర్లో జరిగిందా? రెండు ఊర్లలో జరిగిందా? హీరో హీరోయిన్లది ఒకే ఊరా? అన్న క్లారిటీ మాత్రం లేకుండా పోయింది. క్యాస్టూమ్స్ బాగున్నాయి. అనిల్ ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.

మోతెవరి లవ్ స్టోరీ అని టైటిల్ పెట్టారు.. మోతెవరి అనే పేరులో ఉన్న వైబ్ మాత్రం కథ, కథనంలో లేకుండా పోయింది. ఏదో తోపు లవ్ స్టోరీ చూస్తామని అంతా అనుకుని ఉంటారు.. కానీ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీతోనే సిరీస్ అంతా సాగదీశారు. ఒక్క ఎపిసోడ్‌లో మాత్రం ఫ్లాష్ బ్యాక్ సీన్లు పెట్టారు. టైం పాస్‌కి ఒకసారి అలా చూసి ఎంజాయ్ చేసేలానే సిరీస్‌ను తెరకెక్కించారు. కానీ మరీ ఎక్కువ ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదేమో.

రేటింగ్ 2.5

Exit mobile version