కుల వివక్ష, అంటరానితనం అనేది 80,90వ దశకంలో ఎక్కువగా ఉండేవి. నాటి సమాజంలోని పరిస్థితులను దహనం సినిమాలో చూపించారు. ఇప్పటికే ఈ సినిమాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. ఆదిత్య ఓం మొదటి సారిగా ఇలాంటి ఓ కొత్త తరహా పాత్రను పోషించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది ఓ సారి చూద్దాం.
కథ
ఊర్లోని పురాతన శివాలయంలో పూజలు చేస్తూ, శివుడ్ని ఆరాధిస్తూ జీవనం సాగిస్తుంటాడు భరద్వాజ శాస్త్రి (ఆదిత్య ఓం). శివుడి ధ్యాసలో ఉండి.. భార్యా, బిడ్డలను కూడా పట్టించుకోడు. ఆ ఊరి పెద్ద భూపతి తన పూర్వీకులు ఇచ్చిన గుడిని, గుడిని మాణ్యాలను మళ్లీ చేజక్కించుకోవాలని చూస్తాడు. ఆ ఊర్లో భైరాగి (ఎఫ్ ఎం బాబాయ్) పచ్చి తాగుబోతు. శవాల చుట్టూ భైరాగి, శివుడి చుట్టూ భరద్వాజ శాస్త్రి, పూర్వికుల ఆస్తి కోసం భూపతి తిరుగుతుంటారు. చివరకు శివాలయం, శివుడు ఎవరికి చెందాడు? కాటి కాపరి అయిన భైరాగి చేసిన పనులేంటి? భరద్వాజ శాస్త్రికి ఎదురైన కష్టాలు ఏంటి? అన్నది కథ.
నటీనటులు
భరద్వాజ శాస్త్రి పాత్రలో ఆదిత్య ఓం జీవించేశాడు. హావభావాలు, నడవడికి, కదిలికలు అన్నీ కూడా చక్కగా చూపించారు. మాటలే కాదు, చూపులు, మొహం కూడా నటించేశాయి. ఆదిత్య తనలోని ఇంకో కోణాన్ని ప్రదర్శించారు. ఇక భైరాగి పాత్రలో ఎఫ్ ఎం బాబాయ్ అయితే రెచ్చిపోయాడు. అద్భుతంగా నటించాడు. తాగుబోతుగా నటిస్తూనే వేదాంతాన్ని చెప్పేశాడు. భూపతి విలన్‌గా మెప్పించాడు. అనసూయ, వైదేహి, ఆదమ్మ, సాంబడు పాత్రలు గుర్తుండిపోతాయి.
విశ్లేషణ
దహనం సినిమాలోని కథ, కథనాలు కొత్తగా ఏమీ అనిపించదు. ఎందుకంటే ఈ కుల వివక్ష, అంటరానితనం మీద ఇది వరకే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఓ ముప్పై నలభై సంవత్సరాల క్రితం పరిస్థితులు ఎలా ఉండేవో ఈ దహనంలో చూపించారు. తక్కువ కులానికి చెందిన వ్యక్తి.. ఉన్నత కులానికి చెందిన వ్యక్తిని తాకినా కూడా మైలపడ్డారంటూ దూరం పెట్టే నాటి పరిస్థితులను ఇందులో చూపించారు.
అయితే మానవత్వానికి, సాయం చేయడానికి, ఆకలి తీర్చడానికి కూడా ఇలాంటి పట్టింపులేంటి? నీరు, నిప్పు, గాలి, భూమికి లేని తారతమ్యాలు.. మనుషులకు ఎందుకు అని చూపించారు. మనుషులంతా ఒక్కటే, మానవ సేవే మాధవ సేవ అన్న మాటలను, వాటి అంతరార్థాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నట్టుగా దర్శకుడు చూపించాడు.
దహనం సినిమాలో ప్రథమార్థం చాలా నిదానంగా సాగుతుంది. విరామ సమయంలో చిన్న ట్విస్ట్ అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ఎమోషన్స్ తారాస్థాయికి చేరుతాయి. నటీనటుల పర్ఫామెన్స్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి. పాటలు ఓకే అనిపిస్తాయి. మాటలు ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి. కెమెరా, ఆర్ట్, ఎడిటింగ్ ఇవన్నీ కూడా చక్కగా కుదిరాయి. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా అనిపిస్తాయి.
రేటింగ్ 2.75